Telangana SCERT 10th Class Telugu Guide Pdf Download Telangana ఉపవాచకం రామాయణం Questions and Answers.
TS 10th Class Telugu Guide ఉపవాచకం రామాయణం Questions and Answers
ప్రశ్న 1.
‘మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం’ – ఎట్లాగో వివరించండి. (June 2019) (March 2019)
జవాబు:
రామాయణం మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ, మానవ హృదయాల నుండి, ఎప్పటికీ చెరగదు. రామాయణ గాథ, జీవిత పార్శ్వాలను ఎన్నిటినో కనబరుస్తుంది.
రామాయణంలో అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల దాంపత్య బంధం, గురుభక్తి, గురువులకు శిష్యులపై ప్రేమ, స్నేహబంధం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవ కారుణ్య భావన, ప్రకృతిపై ప్రేమ వంటి జీవిత ఘట్టాలు మనకు రామాయణంలో ఎన్నో కనబడతాయి.
రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి, ఎలా మనీషిగా ఎదగగలడో, మనకు రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
రాముడు రామాయణంలో నాయకుడు. రాముడు మూర్తీభవించిన ధర్మము. ఇతడు సత్యపరాక్రమముడు. రాముని వంటి ఆదర్శ పురుషుడూ, రామాయణం వంటి ఆదర్శ కావ్యమూ ‘నభూతో న భవిష్యతి’.
రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే, ఆదికావ్యం. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తినిస్తుంది. అందుకే మనం రామాయణాన్ని తప్పక చదవాలి.
ప్రశ్న 2.
రామాయణం ఆధారంగా గురుశిష్యుల సంబంధాన్ని వివరించండి. (March 2018)
జవాబు:
పూర్వకాలంలో ‘గురుముఖతః’ విద్య నేర్చుకొనేవారు. గురుసేవలు చేసి, వాళ్ళ అనుగ్రహాన్ని పొంది విద్యలను అభ్యసించేవారు.
రామాయణాన్ని పరిశీలించినట్లయితే రామలక్ష్మణులు కూడా విశ్వామిత్రునికి సేవలు చేసి ఆయన వద్ద అనేక విద్యలను అభ్యసించినట్లు తెలుస్తోంది. విశ్వామిత్రుడు యాగరక్షణ కోసం బాలకులైన రామలక్ష్మణులను తనతో అడవికి తీసుకొనిపోయి ‘బల’, ‘అతిబల’ వంటి విద్యలను బోధించాడు. వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పుల వంటివి ఉండవు. దీన్నిబట్టి శిష్యుల బాగోగులను చూడటం తమ బాధ్యతగా గురువులు గ్రహించేవారని తెలుస్తోంది.
రామాయణం ఆధారంగా పరిశీలిస్తే గురుశిష్యుల సంబంధం ఎంతో విశిష్టమైనదిగా తోస్తుంది. శిష్యులు గురువు ఆజ్ఞను పాటించడం తమ కర్తవ్యంగా భావించేవారు. తాటక వధ గావించిన రాముని చూసి సంతోషించి విశ్వామిత్ర మహర్షి రామునికి ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిది లేదనీ, శిష్యుడు పొందలేనిది లేదనీ రామాయణాన్ని బట్టి గ్రహించవచ్చు.
శిష్యులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఎంతో నిష్ఠ ఉండాలి. సమర్థులైన శిష్యులను చూసి గురువు ఎంతో సంతోషిస్తాడు. పట్టిన పని ఫలవంతమయ్యే వరకు పట్టుదల ఎలా ఉండాలో గంగావతరణం కథ ద్వారా విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు బోధించాడు. గురువు శిష్యుల పట్ల వాత్సల్యంతోను, శిష్యులు గురువు పట్ల వినయ విధేయతలతోను, మెలగుతుండేవారు.
ప్రశ్న 3.
‘ఉత్తమ ధర్మాలను అనుసరిస్తే మనిషి మనీషిగా ఎదుగగలడని’ రామాయణం ఆధారంగా వివరించండి. (June 2017)
జవాబు:
రామాయణము మనకు ఎన్నో ఉత్తమ ధర్మాలను నేర్పుతుంది. అటువంటి ఉత్తమ ధర్మాలను పాటిస్తే, ఆ మనిషి, తప్పక ‘మనీషి’ అవుతాడు. అనగా మంచి బుద్ధిమంతుడు అవుతాడు.
రామాయణములోని ‘శ్రీరాముడు’ పితృవాక్య పరిపాలకుడు. రాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. రాముడు తండ్రి మాటకు కట్టుబడి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాడు. శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడు. రాముడు మాటకు కట్టుబడి ఉండేవాడు. భరతుడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాన్ని పరిపాలించుమని అడిగినా, రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసం చేశాడు.
రాముడు, స్నేహధర్మాన్ని పాటించి సుగ్రీవునితో స్నేహం చేసి అతనికి ఇచ్చిన మాట ప్రకారము, సుగ్రీవుని అన్న వాలిని చంపి, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు.
రాముడు శరణు అని వచ్చిన విభీషణుడికి ఆశ్రయమిచ్చి అతణ్ణి రక్షించి, అతని అన్న రావణుడిని చంపి, స్నేహధర్మంతో విభీషణుడిని లంకా నగరానికి రాజును చేశాడు.
రాముడు అరణ్యంలో ఆశ్రమ ధర్మాలను పాటించాడు. మునులను రక్షించడానికి తాటక, కబందుడు, విరాధుడు, ఖర ధూషణులు, మారీచ సుబాహులు వంటి రాక్షసులను వధించాడు.
రాముడు గురువు విశ్వామిత్రుని వెంట వెళ్ళి అతణ్ణి సేవించి, రాక్షసులను చంపి, ఆయన యజ్ఞాన్ని కాపాడాడు. రాముడు మంచి సోదర ప్రేమ కలవాడు. భరత లక్ష్మణ శత్రుఘ్నులను రాముడు ఎంతో ఆదరించాడు. రాముడు తల్లిదండ్రుల యందు మంచి భక్తిని చూపించాడు. గురువులయిన వశిష్ఠ విశ్వామిత్రుల యందు మంచి భక్తి భావాన్ని చూపాడు.
సుగ్రీవుడు మిత్రధర్మానికి కట్టుబడి, తన వానర సైన్యంతో రామునికి తోడుగా నిలబడ్డాడు. విభీషణుడు కూడా మిత్రధర్మాన్ని పాటించి, రావణుని చంపడంలో రాముడికి సాయం చేశాడు.
లక్ష్మణుడు అన్న వెంట అడవులకు వెళ్ళి అన్నకు సేవచేసి వినయ విధేయతలతో మెలిగాడు. రామలక్ష్మణుల సోదరప్రేమ చాలా గొప్పది. సీతారాముల అన్యోన్య దాంపత్యము, లోకానికి ఆదర్శమైనది.
కాబట్టి చెప్పిన రామాయణంలోని ఉత్తమ ధర్మాలను పాటిస్తే తప్పక ఆ మనిషి “మనీషి” కాగలడు అని చెప్పవచ్చు.
ప్రశ్న 4.
‘అన్నదమ్ముల అనుబంధానికి రామలక్ష్మణులు చిహ్నం’, సమర్థించండి. (June 2016)
జవాబు:
రామలక్ష్మణులు, దశరథ మహారాజునకు పుత్రులు. దశరథుని పెద్ద భార్య కౌసల్యకు రాముడూ, మరొక భార్య సుమిత్రకు లక్ష్మణుడూ పుట్టారు. లక్ష్మణుడు బాల్యము నుండి రామునికి సేవ చేయడమే గొప్పగా భావించేవాడు. లక్ష్మణుడు, రామునికి బహిఃప్రాణము వంటివాడు.
విశ్వామిత్రుని యజ్ఞ సంరక్షణకు రామునితోపాటు లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. లక్ష్మణుడు అన్న మాటపై శూర్పణఖ ముక్కు, చెవులను కోశాడు. సీతారాములు వనవాసానికి వెడుతుండగా రాముని విడిచి ఉండలేక తనను కూడా వెంట తీసుకొని వెళ్ళమని లక్ష్మణుడు రాముడిని ప్రాధేయపడ్డాడు. త్రిలోకాధిపత్యం కంటె, తనకు రాముని సేవాభాగ్యం గొప్పదని లక్ష్మణుడు చెప్పి రామునికి సేవచేసే అదృష్టం తనకు ఇమ్మని అన్నను కోరి, భార్యను విడిచి అన్న వెంట లక్ష్మణుడు అడవికి అందరు వెళ్ళాడు. తల్లి చెప్పినట్లు లక్ష్మణుడు, రాముడిని తనకు తండ్రిగా, సీతను తనకు తల్లిగా భావించి వనంలో సేవించాడు.
శ్రీ లక్ష్మణుడు వనవాసకాలంలో రాముని వెంట ఉండి, విరాధుని, కబంధుని చంపడంలో అన్నకు సాయం చేశాడు. శూర్పణఖ ముక్కు, చెవులు కోశాడు. మారీచుడే బంగారు లేడిగా మారి వచ్చి ఉంటాడని సీతారాములకు చెప్పాడు. సీతను రావణుడు అపహరించినపుడు, లక్ష్మణుడు అన్నకు ఎంతో ధైర్యం చెప్పాడు.
లక్ష్మణుడు యుద్ధంలో రావణ పుత్రులయిన ఇంద్రజిత్తును, అతికాయుడిని చంపాడు. రావణుడు ప్రయోగించిన శక్తి ఆయుధం వల్ల, లక్ష్మణుడు స్పృహ తప్పాడు. అప్పుడు రాముడు లక్ష్మణునికై ఎంతో బాధపడ్డాడు. లక్ష్మణుని వంటి తమ్ముడు ఎక్కడా తనకు దొరకడని, రాముడు కన్నీరు కార్చాడు.
ఓషధీ ప్రభావంతో లక్ష్మణుడు లేచాడు. అప్పుడు రాముడు గొప్ప ఆనందంతో లక్ష్మణుడు మరణించి ఉంటే, తన జయానికి అర్థమే లేదనీ, అ అప్పుడు సీతతో ఏమీ ఉండదనీ చెప్పాడు. సీత గాని, తన ప్రాణాలతో గాని, తనకు ప్రయోజనం ఏమీ ఉం దీనిని బట్టి రామలక్ష్మణుల వంటి అన్నదమ్ముల అనుబంధం, మరెక్కడా కనబడదని తెలుస్తోంది.
ప్రశ్న 5.
శ్రీరాముడి జీవితం ద్వారా మీరేమి గ్రహించారు ? (March 2016)
జవాబు:
రామాయణములో నాయకుడు శ్రీరాముడు. రాముడు నడచిన మార్గమే ‘రామాయణము’. రాముడిలా నడచుకోడమే, మనం రామాయణం నుండి నేర్చుకోవలసిన విషయము. శ్రీరాముడి జీవితం ద్వారా నేను గ్రహించినది.
శ్రీరాముడు మంచి గుణాలరాశి. శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపుడు. రాముడు పితృవాక్య పరిపాలకుడు. రాముడు గొప్ప సోదర ప్రేమ కలవాడు. శ్రీరాముడు మహావీరుడు. మూడు ఘడియల్లో రాముడు దండకారణ్యంలో ఖరదూషణాది రాక్షసులను చంపాడు. తేలికగా రావణ కుంభకర్ణులను యుద్ధంలో సంహరించాడు.
తండ్రి చెప్పినట్లు పితృవాక్య పరిపాలకుడై, 14 సంవత్సరాలు భార్యతో అరణ్యములకు వెళ్ళాడు. భరతుడు తిరిగి రమ్మని అడిగినా, తండ్రికి ఇచ్చిన మాటకే రాముడు కట్టుబడ్డాడు. రాముడు విభీషణుడికి శరణు ఇచ్చి అతడిని లంకాధిపతిని చేశాడు. సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని చంపి, సుగ్రీవుడిని కిష్కింధకు రాజును చేశాడు.
రాముడు తన తమ్ముడు లక్ష్మణుడిపై మంచి ప్రేమ చూపించాడు. రాముడు ఏకపత్నీవ్రతుడు. సీతపై గొప్ప అనురాగం కలవాడు. సీత కోసం లంకకు వచ్చి, రావణుడిని చంపి రాముడు సీతను చేపట్టాడు. రాముడు ధర్మప్రభువు. అందుకే రామరాజ్యం కావాలని ప్రజలు నేటికీ కోరుతున్నారు. తనకు సాయం చేసిన హనుమంతుడిని మెచ్చుకొని రాముడు అతడిని ఆలింగనం చేసుకున్నాడు.
పై విషయాలను రాముడి జీవితం ద్వారా నేను గ్రహించాను. శ్రీరాముడివలె సత్య ధర్మములను సర్వదా పాటించాలని, గ్రహించాను.
ప్రశ్న 6.
భారతీయ జీవన విధానానికి రామాయణం మార్గదర్శకం అని నిరూపించండి. (March 2015)
జవాబు:
సత్యవాక్య పరిపాలన, పితృభక్తి, అన్నదమ్ముల బంధం, భార్యాభర్తల అనుబంధం, స్త్రీలు పతివ్రతలుగా ఉండడం, పరస్త్రీలను కన్నతల్లుల వలె చూడడం, దుర్మార్గులను శిక్షించడం, అన్నను సోదరులు తండ్రివలె గౌరవించడం, కుమారుల మాతాపితృభక్తి అన్నవి భారతీయ జీవన విధానంలో ముఖ్య భాగములు.
‘శ్రీరామాయణంలో పైన చెప్పిన భారతీయ జీవన విధాన పద్ధతులు చక్కగా ప్రదర్శింపబడ్డాయి. రామాయణంలో సీతారాముల ప్రేమానుబంధం లోకానికి మంచి ఆదర్శం. రామాదులకు గల సోదరబంధం, మాతాపితృభక్తి భారతీయ జీవన విధానానికి మార్గదర్శకం. తండ్రి మాటపై రాముడు రాజ్యాన్ని వదలి, భార్యతోపాటు 14 ఏండ్లు వనవాసం చేశాడు.
అడవిలో దుష్టశిక్షణ చేశాడు. స్త్రీ వ్యామోహంతో సీతను అపహరించిన రావణాసురుని సంహరించాడు. తప్పు చేస్తే శిక్ష తప్పదనే భారతీయ జీవన విధానాన్ని ఇది ఋజువు చేస్తుంది. ధర్మమును శ్రీరాముడు నాలుగు పాదాలా నడిపించాడు. ప్రజల మాటలకు ప్రభువు విలువ ఇవ్వాలని శ్రీరాముడు నిరూపించాడు. తన భార్య మహా పతివ్రతయని అగ్ని శుద్ధిచేసి నిరూపించాడు.
శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మము. భారతీయులు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్నే అనుసరిస్తారని రామాయణం 3 ఋజువు చేస్తుంది. సీతారాముల దాంపత్య జీవన విధానం, భారతీయులకు నేటికీ, ఏనాటికీ, మార్గదర్శకం. రామలక్ష్మణ భరతుల సోదర బంధం, భారతదేశంలో అన్నదమ్ముల మైత్రికి మార్గదర్శకం.
అందువల్ల భారతీయ జీవన విధానానికి శ్రీరామాయణం మార్గదర్శకం కాగలదు.
ప్రశ్న 7.
రామాయణంలో మీకు నచ్చిన పాత్ర ఏది ? ఎందుకో తెల్పండి. (శ్రీరాముని పాత్ర విశిష్టత) (లేదా) రామాయణంలో మీకు నచ్చిన పాత్ర గురించి వివరించండి.
జవాబు:
రామాయణంలో రాముని పాత్ర గొప్పది. ఆ తరువాత నాకు నచ్చిన పాత్ర ‘ఆంజనేయుడు’. ఆంజనేయుడు మహా బలశాలి. పసితనంలోనే పండు అని భావించి సూర్యుణ్ణి మింగబోయి ఆకాశానికి ఎగిరాడు. ఇతడు స్వామిభక్తి పరాయణుడు. సుగ్రీవునికి నమ్మినబంటు. ఇతడు రామ సుగ్రీవులకు స్నేహం కలిపిన ప్రజ్ఞాశాలి. శ్రీరామునికి మహాభక్తుడు.
నూరుయోజనాల సముద్రాన్ని దాటి, లంకకు వెళ్ళి సీతకు రాముని వార్తను అందించాడు. అశోకవనాన్ని భగ్నం చేసి, లంకను కాల్చివచ్చి, సీతాదేవి వార్తను రామునకు అందించాడు. సీతజాడ తనకు తెలియని సమయంలో, తన్ను అసమర్థునిగా భావించి లంకలో ప్రాణత్యాగానికి సైతం ఇతడు సిద్ధపడ్డాడు.
వానర వీరులను వెంటబెట్టుకొని రాముని భుజాలపై ఎక్కించుకొని, సముద్రానికి వారధిని కట్టించి, లంకకు చేరాడు. యుద్ధంలో ఎందరో రాక్షసవీరులను ఆంజనేయుడు సంహరించాడు. సంజీవి పర్వతాన్ని తెచ్చి, లక్ష్మణుని బ్రతికించాడు. యుద్ధంలో చచ్చిన వీరులను బ్రతికించాడు. లంకిణిని సంహరించాడు. యుద్ధంలో రావణుని ప్రశంసలను సైతం పొందాడు. ఆంజనేయుడు మహావీరుడు, మహాభక్తుడు. స్వామికార్యాన్ని నెరవేర్చడంలో మహా ఘటికుడు. సీత మెచ్చుకున్న స్వామి భక్తుడు ఆంజనేయుడు. శ్రీరాముని హృదయాన్ని చూరగొన్న భక్తాగ్రణి ఆంజనేయుడు.
ప్రశ్న 8.
రామాయణాన్ని ఎందుకు చదవాలి ?
(లేదా)
“రామాయణము ఒక ఆదర్శగ్రంథము’ అనే అంశాన్ని సమర్థించండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవహృదయాల నుండి ఎప్పటికీ చెరగదు. రామాయణం జీవిత పార్శ్వాలను ఎన్నింటినో కనబరుస్తుంది.
రామాయణంలో అమ్మానాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలు ఎన్నో దీనిలో కనబడతాయి.
రామాయణాన్ని చదవడం అంటే, జీవితాన్ని చదవడమే. రామాయణం ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమమైన ధర్మాలను ఆచరిస్తే, మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో, రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
రామాయణంలో వాల్మీకి మహర్షి మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి, “రామో విగ్రహవాన్ ధర్మః, సత్యధర్మ పరాక్రమః” అనే గొప్పమాటను పలికించాడు.
రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం ‘నభూతో నభవిష్యతి! ” అంటే “పూర్వమందు లేదు, ముందు కాలంలో రాబోదు”. మనిషి ఉన్నంత వరకూ రామాయణం ఉంటుంది.
రామాయణం ప్రపంచ సాహిత్యంలోనే ‘ఆదికావ్యం’. వాల్మీకి మహర్షి సంస్కృతంలో దీనిని 24 వేల శ్లోకాలతో రాశాడు. రామాయణం ముందు తరాల వారికి స్ఫూర్తిని ఇస్తుంది. అందువల్లనే మనం, రామాయణాన్ని తప్పక చదవాలి.
ప్రశ్న 9.
రామాయణ ఆధారంగా అన్నదమ్ముల అనుబంధాన్ని విశ్లేషించండి.
జవాబు:
రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల అన్నదమ్ముల అనుబంధం ప్రశంసనీయం. రామాయణంలో రాక్షసులయిన రావణ కుంభకర్ణ విభీషణులు అనే సోదరుల బంధాన్ని గూర్చి కూడా చెప్పబడింది. విభీషణుడు యుద్ధ సమయంలో అన్నను కాదని, అన్నకు శత్రువైన రాముని వద్దకు చేరాడు. విభీషణుడు చేసిన పని మంచిదే అయినా ఆ అన్నదమ్ముల బంధం అటువంటిది.
రామాయణంలో వాలి సుగ్రీవులు అనే అన్నదమ్ముల గురించి కూడా ఉంది. వాలి, సుగ్రీవుని దూరంగా తరిమి, అతని భార్య రుమను చేపట్టి తప్పు చేశాడు. అది వాలి మరణానికి దారి తీసింది.
రామలక్ష్మణుల సోదరప్రేమ అమోఘమైనది. లక్ష్మణుడు రామునికి బహిఃప్రాణము. అన్నను విడిచి ఉండలేని లక్ష్మణుడు భార్యను, తల్లిని విడిచి, అన్న వెంట వనవాసానికి వెళ్ళాడు. వనవాసంలో అన్నావదినలను సేవించి తరించాడు. యుద్ధంలో జై లక్ష్మణుడు మూర్ఛపోతే లక్ష్మణుని వంటి తమ్ముడు తనకు దొరకడని రాముడు కన్నీరు కార్చాడు. అది రామలక్ష్మణుల అనుబంధం.
ఇక భరత శత్రుఘ్నులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. భరతుని వెంట శత్రుఘ్నుడు భరతుని మేనమామ ఇంటికి వెళ్ళాడు. భరత శత్రుఘ్నులకు రాముడంటే ప్రాణం. రాముని, తన తల్లి అడవికి పంపిందని, భరతుడు తల్లిని నిందించాడు. శత్రుఘ్నుడు మంథరను చంపబోయాడు.
శ్రీరాముని వనవాస దీక్షను మాన్పించి, తిరిగి అయోధ్యలో రాజుగా చేయాలని భరతుడు, శత్రుఘ్నునితో కలసి రాముని దగ్గరకు వెళ్ళాడు. రాముని ఆదేశంపై రాముడు తిరిగి వచ్చేవరకూ రాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి పాలించడానికి భరతుడు అంగీకరించాడు. 14 ఏండ్ల తరువాత రాముడు రాకపోతే భరతుడు అగ్నిప్రవేశం చేస్తానన్నాడు. ఆ అన్నదమ్ముల బంధము అంత గొప్పది.
వాలి, సుగ్రీవుల సోదరబంధం ఆదర్శప్రాయం కాదు. అన్న చెడ్డవాడయితే, అన్నను సైతం విడిచి మంచి మార్గాన్ని అనుసరించాలని విభీషణ వృత్తాంతం వల్ల తెలుస్తోంది. రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం పై విధంగా చిత్రింపబడింది.
ప్రశ్న 10.
రామాయణంలోని ఆదర్శ పాత్రలేవి ? అవి ఎందుకు ఆదర్శ పాత్రలుగా నిలిచాయో రాయండి.
జవాబు:
రామాయణంలో శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. సీతాదేవి మహా పతివ్రత. హనుమంతుడు గొప్ప స్వామిభక్తి పరాయణుడు. లక్ష్మణుడి, భరతుడి సోదర భక్తి అపూర్వమైనది.
సుగ్రీవుడు : రామునకు మంచి మిత్రుడు. సీతాన్వేషణలో రామునికి తోడ్పడ్డాడు.
భరతుడు : భరతుని సోదరభక్తి ఆదర్శమైనది. తల్లి ఇతనికి రాజ్యం ఇప్పించింది. భరతుడు రాజ్య త్యాగం చేసి జటావల్కములు ధరించి, రామపాదుకలకు పట్టాభిషేకం చేశాడు.
శ్రీరాముడు : పితృవాక్య పరిపాలకుడు. తండ్రి మాటపై 14 ఏళ్ళు భార్యతో వనవాసం చేశాడు. ఏకపత్నీ వ్రతాన్ని ఆచరించాడు. సోదరులపై అపారప్రేమను చూపించాడు. మహావీరుడై రావణుని యుద్ధంలో చంపాడు. వాలిని చంపి సుగ్రీవుని, కిష్కింధకు రాజును చేశాడు. విభీషణునికి శరణమిచ్చి, అతణ్ణి లంకాధిపతిని చేశాడు. తనకు మహోపకారం చేసిన హనుమంతుని ఆదరించాడు. రాముడు ధర్మమూర్తి, సత్యవాక్యపాలకుడు.
సీతాదేవి : ఈమె భర్త వెంట అరణ్యాలకు వెళ్ళింది. లంకలో రావణుని చెరలో ఉండి ఎన్నో కష్టాలు పడింది. తన పాతివ్రత్యాన్ని కాపాడుకొంది. అగ్నిప్రవేశం చేసి, తన పాతివ్రత్యాన్ని నిరూపించుకొంది. హనుమంతుడు తనకు చేసిన ఉపకారానికి కృతజ్ఞత చూపింది.
హనుమంతుడు : ఇతడు సుగ్రీవునికి నమ్మినబంటు. శ్రీరామభక్తుడు. నూరు యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి లంకలో వీరులను సంహరించి, లంకను కాల్చి, సీతారాములకు పరస్పర యోగక్షేమాలు తెలియపరచాడు. మహావీరుడు. రావణుడు మెచ్చిన యోధుడు హనుమ.
శ్రీరాముని ధర్మ జీవనయానమే రామాయణం.
ప్రశ్న 11.
రాముని పాత్ర చిత్రణ గురించి రాయండి.
జవాబు:
శ్రీరాముడు సకలగుణాభి రాముడు. శ్రీరాముడు మారీచుడు చెప్పినట్లుగా ధర్మము మూర్తీభవించిన పుణ్యమూర్తి. రాముడు సత్యపరాక్రముడు. రాముడు రూపంలో, గుణంలో గొప్పవాడు. మహావీరుడు. మృదువుగా మాట్లాడతాడు. శరణన్న వారిని కాపాడతాడు. కోపం, గర్వంలేనివాడు. పరుల సంపదను ఆశించడు. తల్లిదండ్రుల యందు, గురువులందు భక్తి కలవాడు. ప్రజల పట్ల వాత్సల్యం కలవాడు. వినయశీలి. ప్రజలందరికీ రాముడంటే ప్రీతి.
రాముడు ధర్మం తెలిసినవాడు. అందమున్నవాడు. ఆపదలు వచ్చినా బెదరనివాడు. వీరుడు ధీరుడు. ఇన్ని గొప్ప లక్షణాలు గలవాడు రాముడు ఒక్కడే అని నారదుడు వాల్మీకికి చెప్పాడు.
శ్రీరాముడు మర్యాదాపురుషోత్తముడు. మాతృభక్తి కలవాడు. పితృభక్తి పరాయణుడు. పితృవాక్య పరిపాలకుడు ఏకపత్నీ వ్రతాన్ని పూనినవాడు. అఖండమైన సోదరప్రేమ గలవాడు. స్నేహితులైన సుగ్రీవ, విభీషణులపై ప్రేమ చూపి, వారిని రాజులుగా చేశాడు.
రాముడు శరణన్న విభీషణుని కాపాడాడు. రాముడు శరణాగతవత్సలుడు. శ్రీరాముడు కృతజ్ఞుడు. హనుమ తనకు చేసిన ఉపకారాన్ని మరువక అతణ్ణి ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. రాముడు ఆడిన మాట తప్పనివాడు. రాక్షస సంహారకుడు. మహాపరాక్రమంతో ఖరదూషణ త్రిశిరులను, రావణ కుంభకర్ణులను హతమార్చాడు.
గొప్ప ప్రజా పరిపాలకుడు. ప్రజలను కన్న బిడ్డలవలె పాలించాడు. మహా పతివ్రతయైన భార్య సీత యందు గొప్ప ప్రేమానురాగాలు కలవాడు. నేటికీ రామరాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ప్రశ్న 12.
రామాయణం విశిష్టతను గూర్చి రాయండి.
జవాబు:
మానవ జీవన మూల్యాలకు మణిదర్పణం రామాయణం. అందుకే కొండలు, సముద్రాలు ఉన్నంతవరకూ రామాయణం ఉంటుందని బ్రహ్మ చెప్పాడు. ఈ విధంగా శాశ్వతత్వాన్ని సంపాదించుకున్న రామాయణాన్ని వాల్మీకి రచించాడు.
రామాయణం అంటే రాముని మార్గం. శ్రీరాముడు సత్యవాక్య పరిపాలకుడై, ధర్మమార్గంలో ప్రజారంజకంగా నడిచాడు. శ్రీరాముడు నడిచిన నడత ధర్మబద్ధం, ఆదర్శవంతం.
మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ రామాయణం. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురువుపై భక్తి-శిష్యులపై ప్రేమ, స్నేహఫలం, ధర్మబలం వంటి జీవితంలోని సంబంధాలను రామాయణం పట్టి చూపిస్తుంది.
వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావం, ప్రకృతి లాలన వంటి జీవిత పార్శ్వాలకు రామాయణం మణి దర్పణం.
రామాయణం ఆచరణ ప్రధానమైనది. సీతారాముల వంటి ఆదర్శ నాయికానాయకుల చరిత్ర ఇది. -“రామో విగ్రహవాన్ ధర్మః” అనే గొప్పమాట మారీచుని వంటి రాక్షసుని నోటి నుండి మహర్షి పలికించాడు. రామాయణం వంటి కావ్యం, ‘నభూతో నభవిష్యతి’. మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది.
ప్రశ్న 13.
‘రాముని వ్యక్తిత్వం మనకు ఆదర్శప్రాయం’ దీనిని విశ్లేషించండి.
జవాబు:
శ్రీరాముడు ధర్మము మూర్తీభవించిన వాడు. ‘రామోవిగ్రహవాన్ ధర్మః’ అని మారీచుడు అన్న మాట సత్యము. రాముడు పితృవాక్య పరిపాలకుడు. రాముడు తల్లులపై, గురువులపై భక్తి గౌరవములు కలవాడు. సోదరులపై అనురాగం కలవాడు. భార్య సీత యెడ అనురాగం కలవాడు. సీతా రాముల దాంపత్యము, లోకానికి ఆదర్శము.
రాముని వలె నడచుకోవాలి అన్నది పెద్దల మాట. రాముని వ్యక్తిత్వము లోకానికి ఆదర్శము. లోకంలో ప్రజలు రామునివలె తల్లిదండ్రులపై, గురువులపై భక్తి గౌరవాలు కలిగి యుండాలి. రాముని వలె తమ్ములను ప్రేమగా చూడాలి. రాముని వలె సత్యాన్ని మాట్లాడాలి.
రాముడు సుగ్రీవునితో అగ్ని సాక్షిగా స్నేహం చేసి, తాను ఇచ్చిన మాట ప్రకారము వాలిని చంపి సుగ్రీవుని కిష్కింధకు రాజును చేశాడు. తనను ఆశ్రయించిన విభీషణునికి అభయం ఇచ్చి రావణుని చంపి, అతణ్ణి లంకాధిపతిని చేశాడు.’ రాముడు తండ్రిమాటను గౌరవించి 14 ఏండ్లు వనవాసం చేశాడు. విభీషణుడు తనకు శత్రువైన రావణునికి తమ్ముడు. అయినా తనను శరణు కోరిన అతడికి అభయం ఇచ్చి అతనిని ఆదరించాడు.
రావణుడు మహావీరుడు. దండకారణ్యంలో ఖరాది దానవులను 14 వేల మందిని తానొక్కడూ ఒక్క గడియలో చంపాడు. రావణ కుంభకర్ణులను సంహరించాడు.
తండ్రికి మిత్రుడైన జటాయువు తనకు సాయం చేశాడని, అతనికి దహన సంస్కారం చేశాడు. రాముడు ధర్మ రక్షణ కోసం వాలిని, రావణుని చంపాడు.
శ్రీరాముడు సుగుణాభిరాముడు. ఆయన వ్యక్తిత్వం, లోకంలో అందరికీ ఆదర్శప్రాయం.
ప్రశ్న 14.
రామాయణం ఆధారంగా కుటుంబంలోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలెలా ఉండాలో సోదాహరణంగా రాయండి.
జవాబు:
రామాయణం ఆచరణ ప్రధానమైన గ్రంథము. రామాయణము మనకు రామునివలె నడవాలి, రావణుని వలె ఉండరాదు అని తెలుపుతుంది. రామాయణ పాత్రలలో ముఖ్యపాత్ర, మనమంతా అనుసరించదగ్గ పాత్ర, శ్రీరామునిది. రాముడు నడచిన మార్గము ధర్మమార్గము. అది సర్వులకూ ఆచరణీయము.
రామునివలె మనము భార్యయందు అనురాగం కలిగి ఉండాలి. రాముడు భార్యకోసం, రావణుడంతటి మహావీరునితో యుద్ధం చేశాడు. రామునకు సీతయందు గల అనురాగము అంత గొప్పది. సీతారాముల దాంపత్య ధర్మం, అందరికీ అనుసరణీయము.
రాముడు తల్లిదండ్రులపై ప్రేమగలవాడు. రాముడు తండ్రిని సత్యప్రతిజ్ఞునిగా నిలబెట్టడం కోసం, 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళాడు. అన్నదమ్ముల బంధం గూర్చి చెప్పాలంటే రామలక్ష్మణులదే. లక్ష్మణుడు తన అన్నయైన రాముని విడిచి యుండలేక, అన్నను సేవిస్తూ 14 ఏండ్లు వనవాసం చేశాడు. భార్యనూ, తల్లినీ విడిచి అన్నకోసం అతడు అడవికి వెళ్ళాడు. భరతుడు తల్లి తనకు రాజ్యం ఇచ్చినా తల్లి చేసిన పని తప్పని ఆమెను నిందించాడు. అన్నపై ప్రేమతో నార చీరలు ధరించి నంది గ్రామంలో ఉండిపోయాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదరబంధం అపూర్వం. మనందరికీ అనుసరణీయం.
రామాయణంలోని మరో సోదర బృందం రావణ కుంభకర్ణ విభీషణులది. విభీషణుడు ధర్మాత్ముడు. తన అన్న చేసిన సీతాపహరణం తప్పని అన్నకు చెప్పి చూశాడు. అన్న వినకపోవడంతో అన్నను విడిచి రాముని శరణుకోరాడు. కుంభకర్ణుడు కూడా రావణుని మందలించాడు. కాని అన్నను విడిచి దూరంగా పోలేదు. అన్న కోసం ప్రాణాలు విడిచాడు.
ఇక వాలి సుగ్రీవులు. వీరిద్దరూ అన్నదమ్ములే. వాలి తమ్ముడు భార్యను అపహరించి సుగ్రీవుని తరిమివేశాడు. అందువల్లే వాలికి చివరకు మరణం వచ్చింది. కాని సుగ్రీవుడు వాలి భార్య తారను చేరదీశాడు. అన్న కుమారుడు అంగదుడిని యువరాజును చేశాడు. వాలి సుగ్రీవులవలె అన్నదమ్ములు పోరాడరాదని ఈ కథ తెలుపుతోంది.
ప్రశ్న 15.
రామాయణంలోని రామలక్ష్మణుల ఆధారంగా సోదరప్రేమలో నువ్వు గ్రహించిన విషయాలేవి ?
జవాబు:
రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు, ఆదర్శ సోదరులు. చిన్ననాటి నుంచీ లక్ష్మణునకు అన్నను సేవించడమే ఇష్టము. లక్ష్మణుడు శ్రీరామునికి బహిః ప్రాణం. భరత శత్రుఘ్నులు, పరస్పరం మంచి ప్రేమాభిమానాలు కలవారు. భరత శత్రుఘ్నులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోయేవారు. భరతుని వెంట శత్రుఘ్నుడు కూడా భరతుని మేనమామ ఇంటికి వెళ్ళాడు. భరత శత్రుఘ్నులకు’ అన్న శ్రీరాముడంటే ప్రాణము. రాముని అడవికి పంపించిందని భరతుడు, తన తల్లి కైకను నిందించాడు. శత్రుఘ్నుడు మంథరను చంపబోయాడు.
శ్రీరామునితో పాటు లక్ష్మణుడు 14 ఏండ్లు వనవాసం చేశాడు. అతడు వదినమ్మ సీతను, తల్లిగా, రాముని తండ్రిగా సేవించాడు. రావణ సంహారం చేయడానికి లక్ష్మణుడు అన్నకు ఎంతగానో తోడ్పడ్డాడు.
భరతుడు తనకు రాజ్యం అక్కర లేదన్నాడు. పెద్దవాడయిన రాముడే రాజ్యం పాలించాలని పట్టుపట్టాడు. తమ్ముడు శత్రుఘ్నునితో కలిసి అడవికి వెళ్ళి రాముని తిరిగి వచ్చి, రాజ్యాన్ని పాలించమని బ్రతిమాలాడు. చివరకు రాముని ఆదేశంపై రాముడు వనవాస దీక్ష నుండి వచ్చే వరకూ శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం చేసి, రామునికి బదులుగా పాలించాడు. 14 ఏండ్ల తర్వాత రాముడు తిరిగి అయోధ్యకు రాకపోతే, భరతుడు అగ్నిప్రవేశం చేస్తానన్నాడు.
రామలక్ష్మణ భరతశత్రుఘ్నులు సోదరబంధము అంత గొప్పది. వారు ఒకరి కోసం ఒకరు ప్రాణాలు వదలడానికి సిద్ధమయ్యేవారు. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోతే, లక్ష్మణుని వంటి తమ్ముడు తనకు దొరకడని, శ్రీరాముడు కన్నీరు కార్చాడు.
ప్రశ్న 16.
రామాయణం చదవడం వల్ల వ్యక్తికి గానీ, సమాజానికి గానీ కలిగే ప్రయోజనమేమి ?
జవాబు:
రామాయణాన్ని చదవడం వల్ల వ్యక్తి, సమాజం బాగుపడతాయి. ఆ వ్యక్తుల జీవితాలు సంస్కరింపబడతాయి. రామాయణంలోని నాయికానాయకులు సీతారాముల వలె వారు ఆదర్శ జీవనాన్ని సాగిస్తారు. ఆంజనేయునివలె మంచిభక్తి భావాన్ని పెంపొందించుకుంటారు. రామాయణము రామునివలె నడవాలని, రావణుని వలె నడువరాదని బోధిస్తుంది. రామాయణము మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం. ఈ కథ మానవుల హృదయాల నుండి ఎప్పటికీ చెరిగిపోదు. రామకథ, జీవిత పార్శ్వాలను ఎన్నింటినో చూపిస్తుంది.
రామాయణంలో అమ్మా నాన్నాల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, స్నేహబంధం, ధర్మబలం వినయంగా ఒదిగి యుండడం, వివేకంతో ఎదగడం వంటి జీవిత పార్శ్వాలు ఎన్నో కనబడతాయి.
రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం ఆచరణ ప్రధానమైన గ్రంథం. ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషి అవుతాడని రామాయణం నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా రామాయణం గొప్ప సందేశాన్ని ఇస్తుంది.
రాముడి వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శకావ్యం పూర్వమందు లేదు, ఇక ముందు పుట్టదు. రామాయణం చదివితే మనిషి ఆదర్శమైన వ్యక్తిగా మారతాడు.
ప్రశ్న 17.
సీతాపహరణం జరగడానికి గల పరిస్థితులను విశ్లేషించండి.
జవాబు:
సీతారాములు పంచవటిలో అరణ్యవాసం చేస్తున్నారు. రావణుడి చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముణ్ణి తన్ను భార్యగా గ్రహించమని కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ ఆ విషయం తన అన్న ఖరుడికి చెప్పింది. ఖరుడు రామునితో యుద్ధం చేసి మరణించాడు.
‘అకంపనుడు’ అనే గూఢచారి, దండకారణ్యంలో ఖరుడు తన 14వేల సైన్యంతో రాముని చేతిలో మరణించాడని రావణునకు వార్త చేర్చాడు. రాముని భార్య సీతను అపహరించమని రావణునికి సలహా ఇచ్చాడు. శూర్పణఖ కూడా అన్న రావణుని దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అవమానాన్ని చెప్పి సీతను అపహరించమని చెప్పింది.
రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్ళి బంగారులేడిగా మారి సీతను అపహరించడానికి తనకు సాయం చేయమని అడిగాడు. మారీచుడు బంగారు లేడిగా మారీ సీతారాముల పర్ణశాల దగ్గర తిరిగాడు. సీత రాముని ఆ లేడిని పట్టి తీసుకు రమ్మని చెప్పింది. అది మాయలేడి అని లక్ష్మణుడు హెచ్చరించాడు.
కాని సీత మాట కాదనలేక రాముడు, లక్ష్మణుడిని సీతకు రక్షణగా ఉంచి లేడి వెనుక వెళ్ళాడు. లేడి దొరకలేదు. రాముడు బాణంతో లేడిని చంపాడు. లేడి “హా సీతా ! లక్ష్మణా !” అని అరిచింది. రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని ఆశ్రమం నుండి బలవంతంగా పంపించింది.
ఆ సమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు.
ప్రశ్న 18.
రామాయణంలో మీకు నచ్చిన పాత్ర ఏది ? ఎందుకో తెల్పండి. (ఆంజనేయుని పాత్ర)
జవాబు:
రామాయణంలో నాకు నచ్చిన పాత్ర ఆంజనేయుడు. ఆంజనేయుడు పుట్టుకతోనే మహాబలశాలి. ఇతడు స్వామిభక్తి పరాయణుడు. సుగ్రీవునికి నమ్మినబంటు. ఎంతో నేర్పుగా మాట్లాడి రామ సుగ్రీవులకు స్నేహాన్ని కుదిర్చాడు. శ్రీరామునికి పరమభక్తుడయ్యాడు. సీతాన్వేషణలో ప్రముఖపాత్ర వహించాడు. సముద్రాన్ని దాటి వెళ్ళి సీతను కలుసుకొని రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు ఇచ్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. సీత ఇచ్చిన చూడామణిని రామునికి తెచ్చి ఇచ్చాడు. లంకా దహనం చేసి రావణునికి హితాన్ని బోధించాడు. సీత కనబడలేదని ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యాడు.
ఆంజనేయుడు సముద్రానికి వారధి కట్టడంలో, రావణ సంహారంలో రామునికి తోడ్పడ్డాడు. సంజీవ పర్వతాన్ని తెచ్చి లక్ష్మణుని బ్రతికించాడు. సీతారాములకు హనుమంతుడు మహాభక్తుడు.
అందుకే నాకు హనుమంతుడు రామాయణంలో నచ్చిన పాత్ర.
ప్రశ్న 19.
అశోకవనంలో సీతాహనుమంతుల సంభాషణను విశ్లేషిస్తూ వారి స్వభావాలను రాయండి.
జవాబు:
హనుమంతుడు అశోకవనంలో సీతను చూచాడు. తన మాటల ద్వారా తాను రామదూతనని సీతకు నమ్మకం కలిగించాడు. సీత కోరికపై హనుమ, రాముని రూపగుణాలను వర్ణించి చెప్పాడు. తాను తెచ్చిన రామముద్రికను హనుమ సీతకు ఇచ్చాడు.
రామ ముద్రికను చూసి సీత ఆనందభరితురాలయ్యింది. సీత తన దీనావస్థను హనుమంతునికి చెప్పింది. రాముణ్ణి త్వరగా లంకను తీసుకువచ్చి తనను రాక్షసుల చెరనుండి విడిపించమని సీత హనుమంతుని కోరింది.
హనుమంతుడు సీతను తన వీపుమీద కూర్చోమన్నాడు. అలా చేస్తే వెంటనే సీతను రాముని వద్దకు తీసుకొని వెళ్ళగలనన్నాడు. కాని సీతమ్మ అందుకు నిరాకరించింది. సీత తాను పరపురుషుని తాకనని చెప్పింది. అప్పుడు హనుమ సీతను రాముడు గుర్తించే ఆనవాలును ఇమ్మని అడిగాడు. సీత తన చూడామణిని హనుమకు ఇచ్చింది.
సీతను వెంటనే రాముని వద్దకు తీసుకొని వెళ్ళి సీతారాములకు ఆనందం కలిగించాలని హనుమ భావించాడని, రాముని క్షేమవార్తను చెప్పి సీత ప్రాణాలను నిలబెట్టాడని వారి సంభాషణ వల్ల తెలుస్తుంది.
సీతమ్మ తనకు వెంటనే చెర నుండి విముక్తి కలగాలని కోరుకోలేదు. ఆమెకు తన పాతివ్రత్యం ముఖ్యం. రాముడే వచ్చి రావణుని చంపి తనను తీసుకొని వెళ్ళాలని ఆమె చెప్పింది. హనుమంతుడు సీతను దొంగతనంగా తీసుకొని వెళ్ళడం, రామునకు అపకీర్తికరమని సీత అభిప్రాయపడింది.
ప్రశ్న 20.
శ్రీరాముని పట్టాభిషేకం ఆగిపోవడానికి కారణం తెల్పండి.
జవాబు:
రాముడిని యువరాజుగా చేయాలని దశరథ మహారాజు నిశ్చయించాడు. ప్రజలూ, మంత్రులూ అందుకు అంగీకరించారు. వసిష్ఠ మహర్షి ఆజ్ఞపై అయోధ్య నగరాన్ని చక్కగా ప్రజలు అలంకరించారు.
అది చూసిన దశరథుని చిన్న భార్య కైక యొక్క దాసి మంథర అసూయపడింది. పరుగు పరుగున వచ్చి రాముని పట్టాభిషేక వార్తను ఆమె కైకకు చెప్పింది. కైక సంతోషించి మంథరకు బహుమానమును ఇచ్చింది.
అందుకు మంథర ఆశ్చర్యపడింది. రాముడు రాజు అయితే కౌసల్య రాజమాత అవుతుందనీ, కైక ఆమెకు దాసి అవుతుందనీ మంథర చెప్పింది. కైక కొడుకు భరతుడు రామునికి దాస్యం చేయవలసి వస్తుందని హెచ్చరించింది. భరతునికి రాజ్యం దక్కేటట్లూ రాముడు వనవాసానికి వెళ్ళేటట్లు చూడమని, మంథర కైకకు దుర్బోధ చేసింది. పూర్వం దశరథుడు కైకకు ఇచ్చిన రెండు వరాలనూ అప్పుడు ఉపయోగించుకోమని మంథర కైకకు సలహా చెప్పింది.
కైక, మంథర దుర్బోధపై కోప గృహంలో ప్రవేశించింది. దశరథుడు వచ్చి కైకను ఎంతగానో బ్రతిమాలాడు. కాని కైక శాంతించలేదు. కైక, దశరథుని రెండు వరాలను కోరింది. దశరథుడు అందుకు అంగీకరించాడు. కైక కోరిన వరాల ప్రకారము, భరతుడు అయోధ్యకు రాజుకావాలి. శ్రీరాముడు నారచీరలు, జడలు, జింక చర్మం ధరించి వెంటనే అడవులకు వెళ్ళాలి.
ఈ విధంగా మంథర దుర్బోధపై, కైక కోరిన వరాల వల్ల శ్రీరాముని పట్టాభిషేకము ఆగిపోయింది.
ప్రశ్న 21.
శ్రీరాముడిని దండకారణ్యానికి పంపేముందు కైకకూ, శ్రీరామునికీ మధ్య జరిగిన సంభాషణలను గూర్చి వ్రాయండి.
(లేదా)
శ్రీరాముని పితృభక్తి తత్పరతను వివరించండి.
జవాబు:
కైకకు వరాలను ఇచ్చిన దశరథుడు, విచారంలో మునిగిపోయాడు. శ్రీరాముడిని చూడాలని ఉంది. తీసుకురమ్మని . సుమంత్రునితో చెప్పాడు. రాముడు వచ్చి కైకకూ, తండ్రికీ నమస్కరించాడు. దశరథుడి నోట మాట రాలేదు. తండ్రిగారి బాధకు కారణం ఏమిటని, రాముడు కైకను అడిగాడు.
దశరథుడు వెనుక తనకు రెండు వరాలను ఇచ్చాడనీ, వాటిని ఇప్పుడు ఇవ్వడానికి రాముడిని దృష్టిలో పెట్టుకొని దశరథు మహారాజు జంకుతున్నాడనీ కైక రాముడికి చెప్పింది. తండ్రిగారి మాటను పాటిస్తానని శ్రీరాముడు ప్రమాణం చేస్తే ఆ వరాలను గూర్చి తాను చెపుతానని కైక శ్రీరామునికి చెప్పింది.
అప్పుడు రాముడు “నా తండ్రే నాకు గురువు. పరిపాలకుడు. ఆయన ఆదేశిస్తే విషాన్ని త్రాగడానికైనా, సముద్రంలో దూకడానికైన సిద్ధమే” అని కైకకు చెప్పాడు. తండ్రిగారి కోరిక ఏమిటో చెపితే తాను తప్పక పాటిస్తానన్నాడు. రాముడు ఆడిన మాట తప్పనని చెప్పాడు.
కౌక తాను దశరథుని కోరిన వరాలను గూర్చి రామునకు చెప్పింది. భరతుడు అంటే తనకు ప్రాణమనీ, తనకు రాజ్యకాంక్ష లేదనీ రాముడు చెప్పాడు. తండ్రికి సేవ చేయడం, ఆయన ఆజ్ఞలను పాటించడం కన్న వేరు ధర్మాచరణము లేదన్నాడు. భరతుని యువరాజును చేయండన్నాడు. నాన్నగారు స్వయంగా చెప్పకపోయినా, నా పినతల్లియైన మీరు చెప్పారు కాబట్టి, వెంటనే నేను దండకారణ్యానికి వెడతానని, రాముడు కైకకు మాట ఇచ్చాడు.
రాముడు పితృవాక్య పరిపాలకుడని దీనివల్ల తెలుస్తోంది.
ప్రశ్న 22.
విరాధుని వృత్తాంతాన్ని వివరించండి.
జవాబు:
వనవాస సమయంలో దండకారణ్యం మధ్యకు చేరుకున్న రామలక్ష్మణులపై దాడిచేసినవాడు ‘విరాధుడు’ అనే రాక్షసుడు. వికృతాకారుడు. రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకొని తీసుకుపోసాగాడు. సీత గోలగోలగా ఏడుస్తున్నది. రామలక్ష్మణులిద్దరు ‘విరాధుని’ చేతులు రెండు నరికేశారు.
విరాధుని వికృత శరీరం భూమిపై పడిపోయింది. ముష్టి ఘాతాలతో, మోకాళ్ళతో దాడి చేస్తు రామలక్ష్మణులు సంహరించాలని చూశారు. ఎంతకు చావని రాక్షసుని గోతిలో పూడ్చే ప్రయత్నం చేశారు. వెంటనే విరాధుడు తాను ‘తుంబురుడ’నే గంధర్వడునని కుబేరుని శాపం వలన రాక్షసునిగా మారినట్లు వివరించాడు. శ్రీరాముని వలన శాపవిమోచనం కలుగుతుందన్న కుబేరుని మాటలు గుర్తు చేసుకున్నాడు.
ప్రశ్న 23.
రావణుడు సీతాదేవిని అపహరించిన వృత్తాంతాన్ని తెలపండి.
జవాబు:
సీతారాములు పంచవటిలో అరణ్యవాసం చేస్తున్నారు. రావణుడి చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చి రాముణ్ణి తన్ను భార్యగా గ్రహించమని కోరింది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోశాడు. శూర్పణఖ ఆ విషయం తన అన్న ఖరుడికి చెప్పింది. ఖరుడు రామునితో యుద్ధం చేసి మరణించాడు.
‘అకంపనుడు’ అనే గూఢచారి, దండకారణ్యంలో ఖరుడు తన 14 వేల సైన్యంతో రాముని చేతిలో మరణించాడని రావణునకు వార్త చేర్చాడు. రాముని భార్య సీతను అపహరించమని రావణునికి సలహా ఇచ్చాడు. శూర్పణఖ కూడా అన్న రావణుని దగ్గరకు వెళ్ళి తనకు జరిగిన అవమానాన్ని చెప్పి సీతను అపహరించమని చెప్పింది.
రావణుడు మారీచుడి దగ్గరకు వెళ్ళి బంగారులేడిగా మారి సీతను అపహరించడానికి తనకు సాయం చేయమని అడిగాడు. మారీచుడు బంగారు లేడిగా మారీ సీతారాముల పర్ణశాల దగ్గర తిరిగాడు. సీత రాముని ఆ లేడిని పట్టి తీసుకు రమ్మని చెప్పింది. అది మాయలేడి అని లక్ష్మణుడు హెచ్చరించాడు.
కాని సీత మాట కాదనలేక రాముడు, లక్ష్మణుడిని సీతకు రక్షణగా ఉంచి లేడి వెనుక వెళ్ళాడు. లేడి దొరకలేదు. రాముడు బాణంతో లేడిని చంపాడు. లేడి “హా సీతా ! లక్ష్మణా!” అని అరిచింది. రాముడు ఆపదలో ఉన్నాడని సీత లక్ష్మణుడిని ఆశ్రమం నుండి బలవంతంగా పంపించింది.
ఆ సమయంలో రావణుడు సన్యాసి వేషంలో వచ్చి ఒంటరిగా ఉన్న సీతను అపహరించాడు.
ప్రశ్న 24.
‘రామాయణం’ ఏ విధంగా విశ్వరూపాన్ని చూపిందో రాయండి.
జవాబు:
‘రామాయణం’ మానవ జీవిత మూల్యాలను చూపింపచేసే అక్షరమణుల అద్దం. అందుకే రామాయణం కొండలు, సముద్రాలు ఉన్నంత వరకూ ఉంటుందని బ్రహ్మ వాల్మీకి మహర్షికి చెప్పాడు. వాల్మీకి, రామాయణాన్ని రచించాడు. దీని తరువాత దేశ విదేశాలలో అనేక ప్రక్రియల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. వీటన్నింటికీ మూలం “వాల్మీకి రామాయణం”. తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. రచయితలు కొందరు వాల్మీకి రామాయణ మూలాన్ని అనుసరించారు. కొందరు స్వతంత్ర పోకడలు పోయారు.
సంస్కృత సాహిత్యం – రామకథ : రామకథ వివిధ పురాణాల్లో కనబడుతుంది.
- ఆధ్యాత్మ రామాయణం
- కాళిదాసు రచించిన ‘రఘువంశం’- దీనిలో రామకథతోపాటు అతని పూర్వుల చరిత్ర కూడా రాయబడింది.
- చంపూ రామాయణం భోజుడు దీనిని గద్యపద్యాలతో రచించాడు.
- “రావణవథ” దీనిని భట్టి కవి రాశాడు.
- ‘ప్రతిమా నాటకం’ పేరుతో రామకథను భాసుడు రాశాడు.
- ఉత్తర రామచరితం: భవభూతి నాటకంగా దీనిని రాశాడు.
- రాఘవ పాండవీయం: రెండర్థాల కావ్యంగా భారత రామకథలు మేళవించి, ధనంజయుడు దీనిని రాశాడు.
కాశ్మీరీ భాషలో దివాకర ప్రకాశభట్టు “రామావలోకచరిత”, “లవకుశ యుద్ధచరిత” ను రచించాడు. మరాఠీలో సమర్థరామదాసు ‘రామాయణం’, మోరోపంతు రాసిన “లవకుశాఖ్యానమ్”, “మంత్ర రామాయణమ్’ పేరు పొందాయి. వంగభాషలో కృత్తివాస ఓఝా “రామాయణానికి” మంచి పేరుంది. తమిళ భాషలో ‘కంబ రామాయణం’ మలయాళంలో ఎళుత్తచ్చన్ “అధ్యాత్మ రామాయణం”, కన్నడంలో నాగచంద్రుడు రాసిన “రామచంద్ర చరిత పురాణం” చంపూ మార్గంలో సాగింది. ఒరియాలో సిద్ధేంద్రయోగి “విచిత్ర రామాయణం” రాశాడు.
ప్రశ్న 25.
తెలుగులో వచ్చిన రామాయణాలను గురించి రాయండి.
జవాబు:
తెలుగు భాషలో రామాయణాలు : గోనబుద్ధారెడ్డి “రంగనాథ రామాయణం” తెలుగులో మొదటి రామాయణం. ఇందులో వాల్మీకి రాయని ఎన్నో కల్పనలు ఉన్నాయి. ఇది ద్విపద రామాయణం. తాళ్ళపాక అన్నమాచార్యులు రామాయణం, కట్టా వరదరాజు రామాయణం, ఏకోజీ రామాయణం ద్విపదలోనే సాగాయి.
తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ తెలుగుజాతిపై ముద్ర వేసింది. హుళక్కి భాస్కరుడు, అతని కుమారుడు మల్లికార్జున భట్టు, శిష్యుడు రుద్రదేవుడు, మిత్రుడు అయ్యలార్యుడు, “భాస్కర రామాయణం” రాశారు. ఇక మొల్ల సంక్షిప్తంగా సుందరంగా రామాయణాన్ని తీర్చిదిద్దింది. అయ్యలరాజు రామభద్రుడు ‘రామాభ్యుదయం’ మంచి ప్రబంధం. తంజావూరు రఘునాథ నాయకుడు ‘రఘునాథ రామాయణం’ వాల్మీకిని అనుసరించి రాశాడు. గోపీనాథ వేంకట కవి ‘గోపీనాథ రామాయణం’ రాశాడు. కంకంటి పాపరాజు ‘ఉత్తర రామాయణం’ రాశాడు.
కాణాదం పెద్దన “ఆధ్యాత్మ రామాయణం” రాశాడు. గద్వాల సంస్థానాధీశులు, ఆరుగురు కవులచే రామాయణాన్ని ఆంధ్రీకరింపజేశారు. వావిలికొలను సుబ్బారావుగారి “ఆంధ్రవాల్మీకి రామాయణం”, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రిగారి “శ్రీకృష్ణ రామాయణం” పేరు పొందాయి.
విశ్వనాథ సత్యనారాయణ గారి “శ్రీమద్రామాయణ కల్పవృక్షం” జ్ఞానపీఠ పురస్కారాన్ని సంపాదించింది. పింగళి సూరన ‘రాఘవ పాండవీయం’ ద్వ్యర్థి కావ్యాన్ని రాశాడు. నెల్లూరి రాఘవకవి ‘యాదవ రాఘవ పాండవీయం’ అనే త్ర్యర్థి కావ్యం రాశాడు. కేశవయ్య “దాశరథి చరిత్ర” పేరుతో నిరోష్ఠ్యరామాయణం రాశాడు.
ఇవి కాక తెలుగులో రామాయణం పాటలు, నాటకాలు, హరికథలు, స్త్రీల రామాయణం పాటలు, వచన కావ్యాలు వచ్చాయి.